అది 1947 స్వతంత్రం రాక ముందు జూలై లో అనుకుంటాను మా నాన్నగారు డిల్లీలో నన్ను సైకిలుమీద కూర్చోపెట్టుకుని (అప్పుడు నాకు పదేళ్ళు) రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ అవీ చూపించి మనకి ఆగస్ట్ పదిహేను న ఇండిపెండెన్సు వస్తుంది అన్నారు. నేను అంటే ఏమిటి అని అడిగే ను. దానికి జబాబుగా ఇన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం ఏలేరు. ఇప్పుడు మనకి స్వతంత్రం వస్తుంది. ఆగస్ట్ 15 కి బ్రిటిష్ జెండా తీసి మన కాంగ్రెస్ జెండా పెడతారు అని చెప్పేరు.
వారం తర్వాత మా ఇంటికి ముగ్గురు నలుగురు స్నేహితులు వచ్చేవారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలకి రిహార్సల్స్ జరిగేవి. నేను, మా తమ్ముడు ప్రేంబాబు ఒక నాటకంలో కుటుంబంలో పిల్లలు. ఇది కాక మా చేత శ్రీ లు పొంగిన జీవగడ్డ యిది అని - - - పాట పాడుర తమ్ముడా ? వేదశాస్త్రములున్నవిచట, ఆది కావ్యములందె నిచ్చట , బాదరాయణ పరమ ఋషులకి - - - పాటపాడవె చెల్లెలా అని చాలా గీతాలు నేర్పేరు .67 సంవత్సరాలు క్రిందటివి కదా పాటలు జ్ఞాపకము లేవు. అవన్నీ స్వాతంత్ర దినోత్సవం కోసమే.
ఎదురు చూసిన స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మేము పార్లమెంట్ భవనం దగ్గర లార్డ్ మౌంట్ బేటన్. నెహ్రు అందర్నీ చూసేము. ఆంద్ర అస్సొసియేషన్ తరఫున ప్రోగ్రాం కి గ్రీన్ రూమ్ లో మా అందరికి మేకప్ చేస్తున్నారు. చాలా మందున్నారు. అందులో ఒక అమ్మాయికి
భారతమాత వేషం వేస్తున్నారు. ఆ అమ్మాయి వయసులో చిన్నది, సన్నజాజి మొగ్గ లా వుంది. ఎవరా ? అని వింతగా చూసేము. ఆ ప్రోగ్రాం లో మా నాన్నగారు, ఇంకో ఆయన రాఘవేoద్రరావుగారని - ఆయన పొట్టిగా ఉండేవారు. వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఉండే కోయ వాళ్ళ నృత్యం డప్పుల లయతో ఒళ్ళంతా మసి పూసుకొని, పూసలు గవ్వల నగలు,తలకి పక్షి ఈకలతో టోపీలాగ అన్నింటికంటే ముఖ్యం ఆడ మగ వేషంలో – మా నాన్నగారు మగవేషం – గోచీ పెట్టుకొని నృత్యం చేసేరు. వేదిక మీదకి రాగానే ఆ వేష ధారణ చూసి గోల, ఈల, చ ప్పట్లు. ఇలా స్వాతంత్ర దినోత్సవం ముగిసింది.
తరువాత రెండు మూడు నెలలకి హిందూ ముస్లింల అల్లరులు మొదలైనాయి. కర్ఫ్యూ - - - తినడానికి ఎం దొరక్క కర్ఫ్యూసడలించగానే మా నాన్నగారు మమ్మల్ని మా అమ్మమ్మగారింటికి శ్రీకాకుళం పంపించేసేరు. అక్కడ మేము 1949 వరకు ఉన్నాము. స్కూలు, చదువు అంతా అక్కడే. ఈ లోగా మా పెద్దమామ పెళ్లి కుదిరింది. పెళ్లి సింహాచలంలో. బస్సులో పెళ్లివారం వెళ్లేము. ఆ పెళ్ళిలో డిల్లీలో స్వాతంత్ర దినోత్సవంలో చూసిన భారతమాత ప్రత్యక్షం! ఎవరా అని ఒకరి నొకరు చూసుకున్నాము. తరువాత డిల్లీ చేరుకున్నాక ప్రతీ తెలుగు ప్రోగ్రాముల్లో భరతమాతని కలుసుకునేవాళ్ళము. ఆవిడెవరనుకున్నారు ? ప్రఖ్యాత తెలుగు న్యూస్ రీడర్ పన్యాల రంగానాధరావుగారి భార్య సర స్వతి (సరు). పన్యాల రంగానాధరావుగారి చెల్లెలే పెళ్ళికూతురు – మా అత్త. ఆ రోజుల్లో ఆలిండియా రేడియో తెలుగులో వార్తలు - చదువుతున్నది పన్యాల రంగానాధరావుగారు అని వింటుండే వారము. ఇలాగే జగ్గయ్యగారు, వారణాసి సుబ్రహ్మణ్యం గారు వగైరాలు. డిల్లీ నుంచే అన్ని భాషల వార్తలు వచ్చేవి. వారూ హీరోల్లాగే ఉండేవారు. ఆ తరువాత చాలా సంవత్సరాలు ప్రతి ఫంక్షన్ కి కలుస్తుండే వారము. ఇళ్ళకి రాక పోకలు. అలా ఉత్తర దేశంలో స్థిరనివాసం అయింది. రాజా (హాసం) తండ్రి నాకు మేనమామ. రాజాకి పన్యాల రంగానాధరావు మేనమామ.
